Search
Close this search box.

పదో తరగతి పరీక్ష షెడ్యూల్ విడుదల

పరీక్ష విధానంలో సంస్కరణలు

హైదరాబాద్‌, 29 డిసెంబర్ (జై మాధవ్ న్యూస్): పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధాన పరీక్షలు 11వ తేదీతో…అన్ని పరీక్షలు 13వ తేదీతో ముగుస్తాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడించారు. టెన్త్‌ పరీక్షల సన్నద్ధతపై తన కార్యాలయంలో బుధవారం అధికారులతో మంత్రి సమీక్షించారు. పరీక్షల కాలపట్టిక (టైంటేబుల్‌)కు ఆమోదం తెలిపారు. వంద శాతం సిలబస్‌తో వార్షిక పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్‌ ఛాయిస్‌ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఉండదని వెల్లడించారు. అందుకు సంబంధించిన మాదిరి ప్రశ్నపత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ‘‘టెన్త్‌ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. సెలవు దినాల్లో కూడా పెట్టాలి. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు ఉండాలి. సబ్జెక్టులలో వెనుకబడిన వారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా బోధించాలి’’ అని కూడా స్పష్టం చేశారు.

పరీక్ష సమయం 

సైన్స్‌కు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్‌ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. మిగిలిన వాటికి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.

ఈ ఏడాది నుంచి మార్పులివీ…

ఈ విద్యా సంవత్సరం(2022-23) నుంచే 9, 10 తరగతుల వారికి పరీక్షల్లో పలు సంస్కరణలు తెస్తూ ప్రభుత్వం బుధవారం జీవో 33 జారీ చేసింది. గతంలోనే ప్రకటించినట్లు పరీక్షల్లో 11 పేపర్లకు బదులు ఆరే ఉంటాయి. తొమ్మిదో తరగతికి ఎస్‌ఏ-1, ఎస్‌ఏ-2తోపాటు పదో తరగతిలో ఎస్‌ఏ-1, చివరి పరీక్షలకు అది వర్తిస్తుంది. (ఈ ఏడాదికి మాత్రం ఇప్పటికే 9, 10 తరగతుల వారికి ఎస్‌ఏ-1 పరీక్షలు పూర్తయ్యాయి.)

ఇప్పటివరకు నాలుగు ఫార్మేటివ్‌ ఎసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ) పరీక్షలకు 20 మార్కులు, ఒక్కో పేపర్‌కు 40 మార్కులు చొప్పున రెండు పేపర్లకు కలిపి 80 మార్కులకు పరీక్షలు ఉండేవి. గతంలో మాదిరిగానే ఎఫ్‌ఏలకు ఈసారీ 20 మార్కులే ఉంటాయి. కాకపోతే సైన్స్‌లో రెండు భాగాలు ఉన్నందున భౌతికశాస్త్రానికి 10 మార్కులు, జీవశాస్త్రానికి 10 మార్కులు కేటాయిస్తారు. ఈసారి ఆరు పేపర్లు అయినందున ఒక్కో సబ్జెక్టుకు 80 మార్కుల పరీక్ష ఉంటుంది.

సైన్స్‌ ప్రశ్నపత్రంలో రెండు భాగాలుంటాయి. మొదటిది భౌతికశాస్త్రం కాగా…రెండోది జీవశాస్త్రం. ఒక్కో భాగానికి 40 మార్కులు. వేర్వేరు ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలు ఇస్తారు. భౌతికశాస్త్రాన్ని ఒక జవాబుపత్రంలో, జీవ శాస్త్రాన్ని మరో జవాబుపత్రంలో రాయాలి. మొదటి భౌతికశాస్త్రం పరీక్ష గంటన్నర ముగిసిన తర్వాత…..జీవశాస్త్రం ప్రశ్నపత్రం ఇస్తారు. మొదటి భాగం జవాబుపత్రాలను తీసుకోవడం…రెండోది ఇవ్వడం కోసం ఈ సబ్జెక్టుకు 20 నిమిషాల సమయం అదనంగా ఇచ్చారు.

38 ప్రశ్నలు… 80 మార్కులు అందులో 20 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు

పదో తరగతిలో ఈసారి 80 మార్కుల ప్రశ్నపత్రంలో 30 మార్కులకు వ్యాసరూప ప్రశ్నలు ఉండనున్నాయి. ఒక్కో దానికి అయిదు మార్కుల చొప్పున…ఆరు ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నలో ఏ లేదా బి అని రెండు ప్రశ్నలుంటాయి. దాన్నే అంతర్గత వెసులుబాటు (ఇంటర్నల్‌ ఛాయిస్‌)గా పిలుస్తారు. ఆ రెండింటిలో ఏదో ఒకదానికి సమాధానం రాయాలి. అంటే దాదాపు ప్రశ్నపత్రంలో ఛాయిస్‌ లేనట్లే. ప్రతి పాఠ్యాంశాన్ని చదివితే తప్ప సమాధానాలు రాయడం వీలుకాదని నిపుణులు చెబుతున్నారు. గతంలో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు రెండు పేపర్లకు కలిపి 10 మార్కులకే ఉండేవి. ఈసారి వాటిని 20 మార్కులకు పెంచారు.పదో తరగతి మాదిరి ప్రశ్నపత్రాలను బుధవారం విడుదల చేశారు.

ఇదీ ప్రశ్నపత్రం స్వరూపం…

ప్రశ్నపత్రం పార్ట్‌-ఏ, బిగా ఉంటుంది. మొత్తం 38 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌-ఏలో మూడు సెక్షన్లు. అవి అతి లఘు సమాధాన ప్రశ్నలు, లఘు ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు. వాటికి 60 మార్కులు. పార్ట్‌-బిలో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో దానికి ఒక మార్కు చొప్పున 20 ప్రశ్నలు ఇస్తారు.

Recent Post

Live Cricket Update