Search
Close this search box.

ప్రతి గడపకు టీఎస్ఆర్టీసీ కార్యక్రమాలు -ఎండీ వీసీ సజ్జనర్

•విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థకు శ్రీకారం | •లాంఛనంగా ప్రారంభించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనర్

జై మాధవ్ న్యూస్ (హైదరబాద్, 10 మే):రాష్ట్రం లోని ప్రతి గడపకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కార్యక్రమాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విలేజ్ బస్ ఆఫీసర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. ఈ విలేజ్ బస్ ఆఫీసర్ల ద్వారా ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా  1730 మంది విలేజ్ బస్ ఆఫీసర్లను నియమించామని వెల్లడించారు. హైదరాబాద్ లోని బస్ భవన్ లో విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన విలేజ్ బస్ ఆఫీసర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

“టీఎస్ఆర్టీసీకి మీరే బ్రాండ్ అంబాసిడర్లు. ప్రజలకు సంస్థకు మధ్య మీరు అనుసంధానకర్తల్లాగా వ్యవహారించబోతున్నారు. సంస్థపై ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింతగా పెంచడంలో మీ వంతుగా కృషి చేయాలి. మన సంస్థ ప్రజలకు కల్పిస్తోన్న సౌకర్యాలను, వివిధ కార్యక్రమాలను ప్రజలకు వివరించండి.  పెళ్లిళ్లు, శుభకార్యాలకు అద్దె బస్సుల బుకింగ్, కార్గో సేవలు, తిరుమల శ్రీవారి దర్శన సదుపాయం, తదితర అంశాలు ప్రజలకు చెప్పాలి. జాతరలు, సంతల సమయాల్లో ఆయా రూట్లలో బస్సు సర్వీసులు ఏర్పాటు చేసేలా డిపో యాజమాన్యంతో సమన్వయం చేసుకుని ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) పెంచేలా పాటుపడాలి. గ్రామాల్లోని ప్రజల రవాణా అవసరాలకు మీరే గుర్తు వచ్చే విధంగా వారితో మమేకమవ్వాలి. మిమ్ముల్ని అధికారులుగా గుర్తించి ఇచ్చిన ఈ బాధ్యతను ప్రతి ఒక్కరు సమర్థవంతంగా నిర్వహించాలి. సంస్థను ప్రజలకు మరింతగా దగ్గర చేయడంలో మీ పాత్ర కీలకమనే విషయం మరిచిపోవద్దు. ” అని సజ్జనర్ అన్నారు. ప్రజలతో మర్యాదగా మెలగాలని హితవు చెప్పారు. టీఎస్ఆర్టీసీ విశ్వసనీయత దెబ్బతినేలా వ్యవహారించొద్దని, స్వీయ  క్రమ శిక్షణ కలిగి ఉండాలని హెచ్చరించారు.  టీఎస్ఆర్టీసీ గతకొంత కాలంగా ఐటీలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు. సాంకేతికతను అందిపుచ్చుకుని టీఎస్ఆర్టీసీ సేవలను ప్రజలకు వివరించాలన్నారు.

విధి నిర్వహణలో అత్యున్నత ప్రతిభ కనబరించిన విలేజ్ బస్ ఆఫీసర్లను సంస్థ గుర్తించి సత్కరిస్తుందని, ఈ ప్రోత్సహకాలను మోటివేషన్ గా తీసుకుని మంచిగా పనిచేసి.. సంస్థ వృద్దికి కృషి చేయాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పిలుపునిచ్చారు. 

అనంతరం విలేజ్ బస్ ఆఫీసర్ వ్యవస్థ పోస్టర్, కరదీపికను ఆయన ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విలేజ్ బస్ ఆఫీసర్ కు ఐడీ కార్డుతో పాటు బ్యాగ్ ను అందజేశారు. తమను అధికారులుగా గుర్తించి ఈ బాధ్యతను అప్పగించింనందుకు సజ్జనర్ కు విలేజ్ బస్ ఆఫీసర్లు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియజేశారు.

 

ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్(విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ) డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, యాదగిరి, సీపీఎం కృష్ణకాంత్, సీటీఎం జీవన ప్రసాద్,  చీఫ్ మేనేజర్(ప్రాజెక్ట్స్ అండ్ ఎస్టేట్స్) విజయ్ కుమార్, సీఈఐటీ రాజశేఖర్, బిజినెస్ హెడ్ సంతోష్ కుమార్, సీటీఎం(మార్కెటింగ్) సుధా పరిమళ, సికింద్రాబాద్, హైదరాబాద్ ఆర్ఎంలు వెంకన్న, వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Recent Post

Live Cricket Update

You May Like This